Badami Chalukya | హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా ముదిమాణిక్యం గ్రామం చివర కృష్ణా నది ఒడ్డునే ఉన్న బాదామి చాళుక్య శైలిలోని అరుదైన రెండు ఆలయాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుగు యూనివర్సిటీ ఆర్కియాలజీ విభాగం పబ్లిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీకి చెందిన డాక్టర్ ఎం ఏ శ్రీనివాసన్, ఎస్ అశోక్ కుమార్ల బృందం వెలుగులోకి తెచ్చింది.
బాదామి చాళుక్య పాలనాకాలం, అంటే క్రీస్తు శకం 543 నుంచి 750 మధ్య కాలంలో ఈ ఆలయాలను నిర్మించారు. తెలంగాణలో అలంపూర్లో తప్ప బాదామి చాళుక్యుల ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలోనే మిగిలి ఉన్నాయి. ఈ గ్రామంలో దొరికిన మరో చారిత్రక ఆధారం 8 లేదా 9వ శతాబ్దానికి చెందిన బాదామి చాళుక్యుల చివరి కాలం నాటి లఘు శాసనం. ‘గండళోణర్రు’ అని రాసి ఉన్న లఘు శాసనం గ్రామంలోని ఐదు గుళ్లలో (పంచకూట)ని ఒక గుడిలోని స్తంభంపై ఉన్నది. ఇందులోని మొదటి రెండు అక్షరాలైన ‘గండ’కు అర్థం కన్నడలో వీరుడని ఆరియలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం భావిస్తున్నారు.