నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్13(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ రూరల్: నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ప్రహసనంగా మారి ఏకంగా వివాదాలకు దారితీస్తున్నది. మిర్యాలగూడలోని ఓ రైస్‌మిల్లులో పరస్పర దాడులు జరిగినట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం కలకలం రేపింది. సన్నాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో రైస్‌మిల్లర్ల ఇష్టారాజ్యంగా మారింది. ఒక దశలో క్వింటాకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు లభించాల్సిన సన్నాల ధర కనీసం రూ.2,000 నుంచి రూ.2,100 దాటకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర ఇప్పిస్తామని అక్కడక్కడా కొందరు రంగంలోకి దిగడంతో వివాదాలకు దారితీస్తున్నది.
రెండు జిల్లాల ధాన్యం ఇక్కడే విక్రయం
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, గూడూరు, వెంకటాద్రిపాలెం, వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారుల్లోని రైస్‌మిల్లులు సన్నధాన్యం కొనుగోళ్లకు ప్రసిద్ధి. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని అధిక ప్రాంతం రైతులు తమ సన్నధాన్యాన్ని తెచ్చి ఇక్కడే విక్రయిస్తుంటారు. హెచ్ఎంటీ రకాలకు రూ.2 వేల వరకు, జైశ్రీరాం, చింట్లు, జేఎస్ఆర్ రకాలకు రూ.2,150 వరకే ధర చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఒక్కో క్వింటాపై రూ.200 నుంచి 300 వరకు నష్టపోతున్నారు. నిత్యం లక్షలాది రూపాయల తమ కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
ఇరువర్గాల ఫిర్యాదులు
గొడవ సద్దుమణగక పోవడంతో స్థానిక యువకుడైన శివనేని నాగరాజును పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అనంతరం మిల్లు యజమాని మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాదలాపురానికి చెందిన నాగరాజు, వెంకన్న, సైదులు తమకు సంబంధం లేని ధాన్యం తెచ్చి ఎక్కువ ధరకు కొనాలని ఒత్తిడి తెచ్చారని, తమపైనా దాడి చేశారన్న తదితర కారణాలతో ఫిర్యాదు చేశారు. మిల్లు యజమాన్యం కూలీలతో తమపై దాడి చేయించి గాయపర్చినట్టు నాగరాజు, వెంకన్న, సైదులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన మిల్లు యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సాయంత్రం పోలీస్‌స్టేషన్ ఎదుట వీరు తమ కుటుంబసభ్యులతో ఆందోళనకు దిగారు.
సూర్యతేజ రైస్‌మిల్లు వద్ద ఘర్షణ
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి శివారులోని సూర్యతేజ రైస్‌మిల్లు వద్ద శనివారం సాయంత్రం మిల్లు యజమాన్యానికి, స్థానికులకు మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో మిల్లు యాజమాన్యం రైతులపై దాడికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. సూర్యతేజ రైస్‌మిల్లుకు శనివారం పెద్ద ఎత్తున సన్నధాన్యం ట్రాక్టర్లు వచ్చాయి. ఎప్పటిలాగే ఇక్కడ మద్దతు ధర లభించకపోవడంతో రైతుల్లో తీవ్ర అసహనం నెలకొన్నది. ఇదే అదనుగా మిల్లు ప్రాంతంలోని బాదలాపురం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు రంగంలోకి దిగారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాల్సిందేనని సూర్యతేజ రైస్‌మిల్లు యజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే సాయంత్రం కావడంతో తీసుకోలేమంటూ మిల్లు యజమాన్యం నిరాకరించింది. ఈ క్రమంలో మిల్లు ఓనర్ రంగనాథ్‌తోపాటు ఇతర సిబ్బందికి స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదంతోపాటు ఘర్షణ చోటుచేసుకున్నది.