సిటీబ్యూరో, అక్టోబర్ 9 ( నమస్తే తెలంగాణ ) : సీఎంఆర్ షాపింగ్ మాల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచార పోస్టులను నమ్మవద్దని నిర్వాహకులు పేర్కొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాల్లో సుపరిచితమైన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుని, వేడుక ఏదైనా సీఎంఆర్తోనే శుభారంభం అనే నానుడితో ప్రతి ఇంటా చెరగని ముద్రవేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఇటీవల కొంతమంది పోటీదారులు సీఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో సీఎంఆర్ లోగోను సోషల్ మీడియా పోస్టులో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ దీనిని గమనించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామని ది వైజాగ్‌పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఫౌండర్ మావూరి వెంకటరమణ చెప్పారు. సీఎంఆర్ వ్యాపార రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ ముందుందని మురళీకృష్ణ గుర్తు చేశారు. సీఎంఆర్‌పై కావాలనే కొందరు మతపరమైన అంశాలను జోడించి విషప్రచారం చేస్తున్నారని వీసీసీఐ ప్రెసిడెంట్ సుదర్శన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సీఎంఆర్‌పై వస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని పైడా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.