Curry puff | జడ్చర్ల టౌన్, ఆగస్టు 12 : ఓ మహిళ బేకరీకి వెళ్లి కర్రీపఫ్ తీసుకొని తింటుండగా అందులో పాముపిల్ల ప్రత్యక్షమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్స్టేషన్ ఎదుట ఉన్న బేకరీకి వెళ్లింది. అక్కడ కర్రీ, ఎగ్పఫ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది.
కర్రీపఫ్ తింటుండగా.. అందులో పాము పిల్ల ఉండటాన్ని గుర్తించి భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సాయంతో బాధితురాలు బేకరికి వెళ్లి యజమానిని ప్రశ్నించింది. అతను సరైన సమాధానం ఇవ్వకుండానే షాపు మూసేసి అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.