సంగారెడ్డి : రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(B.V. Raghavulu )విమర్శించారు. సంగారెడ్డి సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఒకే దేశం, ఒకే ఎన్నికని బీజేపీ కుట్రలు పన్నుతున్నది. పార్లమెంట్లో జమిలి బిల్లు పాస్ కాదని విషయం తెలిసినా హైలెట్ కావడం కోసమే బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రులు కస్తూర్బా ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
పంజాబ్లో గత 39 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. దలేవాల్ అనే రైతు నాయకుడు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు . అయినా కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలపై స్పందించకపోవడం దారుణమన్నారు. కస్తూర్బా గాంధీ ఉద్యోగులు(Kasturba Gandhi employees) గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లపై దృష్టి సారించాలి. ఉద్యోగులను చర్చలకి పిలిచి ప్రభుత్వం మాట్లాడాలని సూచించారు.