Azharuddin | హైదరాబాద్ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అజారుద్దీన్ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని మంత్రులతో పాటు పలువురు ప్రముఖులకు జీఏడీ ఆహ్వాన లేఖలను పంపింది.

అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తుంది. కానీ, ఈ రెండేళ్లలో మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీలో దిగి.. ఓడిపోయారు. అయితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓట్లను మభ్యపెట్టే విధంగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంది. హైదరాబాద్ పరిధిలో ఎన్సిసి కోడ్ కేవలం జూబ్లీహిల్స్ పరిమితమైనప్పటికీ.. ఇది జూబ్లీహిల్స్‌లోని ఓటర్లను సైతం ప్రభావితం చేస్తున్నందున ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకోవాలి అని.. ఎన్నికల అధికారులకు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.