 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ (Azharuddin) ఇప్పుడు కాంగ్రెస్‌కు (Congress) పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చేస్తున్నదా? అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటేనా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సాంకేతికంగా అజారుద్దీన్ మంత్రి పదవిలో ఆరు నెలలకు మించి కొనసాగే అవకాశాలు లేవని చెప్తున్నారు. మరోవైపు, ఆయనకు మంత్రి పదవి ఆరు నెలలకు మించి ఉండదని ఎంఐఎం నేతలకు ముఖ్యనేత హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ లెక్కన అజారుద్దీన్‌ను ఎన్నికల కోసమే వాడుకొంటున్నారని, ఆరు నెలల తర్వాత కూరలో కరివేపాకును చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లిం మైనార్టీలు గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మొగ్గుతున్నట్టు కాంగ్రెస్ అంతర్గత సర్వేలు నిర్ధారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఏఐసీసీ అప్రమత్తం అయ్యిందని, మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో కలిసి వస్తుందనే భావనతో అజారుద్దీన్‌ను తెరమీదికి తెచ్చినట్టు చర్చ జరుగుతున్నది. దీనికితోడు నిజామాబాద్‌లో జరిగిన రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ భయపడినట్టు చెప్పుకుంటున్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణం తర్వాత అజారుద్దీన్ తనకు తానుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించుకున్నారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ టికెట్ నాకే. బరిలో నేనే ఉంటా’ అని చెప్పుకున్నారు. తనకు ఓటు వేయాలని ప్రచారం కూడా చేసుకున్నారు. గత ఎన్నికల్లో గోపీనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో తనకు ఈసారి గెలుపు ఖాయమని భావించారు. అయితే, అజార్ సొంతంగా టికెట్ ప్రకటించుకోవడంపై ఢిల్లీ దూత వద్ద కాంగ్రెస్ పెద్దలు పంచాయితీ పెట్టినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఎంఐఎం నేతలు కూడా సీన్లోకి వచ్చారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మైనారిటీ అభ్యర్థిని నిలబెడితే, తామూ బరిలోకి దిగుతామని అజారుద్దీన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించినట్టు సమాచారం.
జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా ఉన్నదని, వారిని కాదంటే మైనారిటీ ఓట్లు చీలిపోయి ఓటమి మూగట్టుకుంటామని ముఖ్యనేత సన్నిహిత వర్గం ఢిల్లీ దూతకు చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. వారి మాటలను నమ్మి ఆమె అజార్‌ను పిలిచి పార్టీకి చెప్పకుండా ప్రచారం ఎలా చేసుకుంటారు? అని తలంటినట్టు గుసగుసలు వినిపించాయి. దీంతో అజారుద్దీన్ ప్రచారాన్ని నిలిపివేశారట. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే అజారుద్దీన్ ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని కలిసి ఆ ఫొటోలు మీడియాకు రిలీజ్ చేయడం ద్వారా ముఖ్యనేత వర్గానికి, మజ్లిస్ నేతలకు సవాల్ విసిరారు. దీంతో ఎలాగైనా ఆయనకు టికెట్ దక్కకుండా చేసేదుకు ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారన్న ప్రచారం ఉన్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ వరుస సర్వేలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టకముందు, నిలబెట్టిన తర్వాత పరిస్థితులు, అభ్యర్థి కుటుంబానికి రౌడీషీటర్ ముద్ర ఉండటం వంటి అంశాలపై అటు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయించినట్టు తెలిసింది. ప్రతి సర్వేలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 6-8% ఓట్లు ముందంజలో ఉన్నట్టు వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయించడం, బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం, నిజామాబాద్ జిల్లాలో రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ మరో మూడు సర్వేలు చేయించినట్టు తెలిసింది.
ఈ ఫలితాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి 9 నుంచి 11% ఓట్లు వెనుకబడి ఉన్నట్టు తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మళ్లుతున్నట్టు తేలిందని సమాచారం. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల యూసుఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభ ప్లాప్ అవడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే ముఖ్యనేతకు తలంటినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముస్లిం ఓటర్లు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు మళ్లుతుంటే దిద్దుబాటు చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముస్లిం ఓటర్లలో ఉన్న అపోహలు తొలిగిపోవాలంటే ఆ సామాజిక వర్గంలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, కాబట్టి అజారుద్దీన్ పేరును ప్రకటించాలని ఆదేశించినట్టు తెలిసింది.
అజారుద్దీన్‌కు పదవి ఆరు నెలలకు మించి ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి అనేక కారణాలు చూపిస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను పంపినా, గవర్నర్ ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్నది. అది ఇప్పట్లో తేలదని భావిస్తున్నారు. చట్టసభల్లో సభ్యులుగా లేని వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే, ఆరు నెలల్లోగా శాసనసభలోగానీ, శాసనమండలిలోగానీ సభ్వత్వం పొందాలని రాజ్యాంగంలోని అర్టికల్ 75(5) చెప్తున్నది.
ప్రస్తుతం అజారుద్దీన్ అసెంబ్లీలోగానీ, మండలిలోగానీ లేరు. అంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగాగానీ ఎన్నిక కావడం తప్పనిసరి. అయితే, రాబోయే ఆరు నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లు ఏమిలేవని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. 2026 నవంబర్‌లో గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి విబేధించిన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు స్పీకర్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఒక బెర్తు ఖాళీ ఏర్పడుతున్నది. అయితే, ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ స్థానం మళ్లీ నింపాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. 42% రిజర్వేషన్ల పంచాయితీ తెగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం అసాధ్యం. ఇలా ఏ కోణంలో చూసినా అజారుద్దీన్ తన పదవిలో ఆరు నెలలకు మించి కొనసాగే అవకాశం లేదని భావిస్తున్నారు.
అజారుద్దీన్‌కు ఎమ్మెల్యే టికెట్టే వద్దని చెప్తే, ఇప్పుడే ఏకంగా మంత్రి పదవి ఇవ్వడంపై ఎంఐఎం నేతలు సీరియస్ అయినట్టు చర్చ జరుగుతున్నది. మమ్మల్ని మోసం చేశారంటూ ముఖ్యనేతపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ముఖ్యనేత వారి వద్దకు రాయబారిని పంపి ‘ఇదంతా అధిష్ఠానం నిర్ణయం. ఇందులో నా పాత్రేమీ లేదు’ అని సంజాయిషీ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గట్టెక్కేలా తనకు సహకరించాలని ప్రాధేయపడినట్టు తెలిసింది.
‘ఆరు నెలల్లో మంత్రివర్గంలో అనేక మార్పులు జరుగుతాయి. మీకు ఇబ్బంది కలించే వ్యక్తులకు పదవి ఉండదు’ అని హామీ ఇచ్చి బతిమాలుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, తన ఆత్మీయ స్నేహితులైన ఎంఐఎం చేజారిపోకుండా ముఖ్యనేత తన అస్మదీయ పార్టీ సహాయం అర్థించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ విస్తరణ ఎలా చేస్తారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కోరిక మేరకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
 
                            