సూర్యాపేట : జిల్లాకేంద్రంలో అయ్యప్ప పడిపూజ నేత్రపర్వంగా సాగింది. మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో పూడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గురుస్వామి వేణుమాధవ్ శర్మ నేతృత్వంలో పూజ కార్యక్రమాలు జరగ్గా.. మంత్రి జగదీశ్‌రెడ్డి – సునీత దంపతులు, మంత్రి తనయుడు వేమన్‌రెడ్డి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం మెట్లపూజ కనులపండువలా సాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప శరుణుఘోష, దీక్షాపరుల నృత్యాలతో క్యాంప్ ఆవరణ మార్మోగింది. ఆ తర్వాత అయ్యప్ప దీక్షాపరులకు మంత్రి కుటుంబీకులు భిక్ష ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఉదయం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండ నగర సంకీర్తన సాగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.