సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో స్వరూపనంద స్వామి ఇవాళ సిద్దిపేటకు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారిని మంత్రి హరీశ్‌రావు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2013లో సిద్దిపేటలో స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం అతి రుద్ర యాగం అద్భుతంగా జరిగిందని గుర్తు చేశారు. ఆ సంకల్పంతో రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని పేర్కొన్నారు. అదే సంకల్పంతో వచ్చే నెల 19 నుండి నిర్వహించే ఆయుత చండి అతి రుద్ర మహాయగం ఘనంగా నిర్వహించుకుందమని చెప్పారు. యాగం నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. సిద్దిపేటలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా, అది విజయవంతం అవుతుందన్నారు. యాగం నిర్వహణ నేపథ్యంలో అక్టోబర్ 6వ తేదీన కార్యక్రమ పనులకు భూమిపూజ చేస్తామన్నారు. సిద్దిపేటలో 78వ విశ్వశాంతి మహాయగం నిర్వహించడం, అదే విధంగా శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం జరగడం విశేషమని స్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో యాగ నిర్వహకులు గ్యాదరి పరమేశ్వర్, నేతి కైలాసం, బండ అంజయ్య, ఎల్లేషం, రమేష్ తదితరులు ఉన్నారు.