Ayushman Bharat | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా 70 ఏండ్లకు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పింది. దీనికి అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. అయితే, ఈ పథకం అమలుపై వైద్య వర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నా.. ప్రైవేట్ దవాఖానలు ఈ పథకం కింద రోగులకు చికిత్సలు అందించడం లేదు.
ప్యాకేజీలు తక్కువగా ఉండటం, ముందుగా చికిత్స చేసి బిల్లుల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరుగాల్సి రావడం వంటి కారణాలతో ప్రైవేట్ దవాఖానలు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అతి తక్కువ దవాఖానలు మాత్రమే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌ను అమలుచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేలా ఒప్పించాలని, ఆ తర్వాతే వృద్ధులకు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.