హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్లతో డాటాసెంటర్ల ఏర్పాటును ప్రకటించింది. 2030 నాటికి రూ.36,300 కోట్లతో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) పేర్కొన్నది. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా కార్యక్రమంలో సంస్థ ప్రకటించింది. 2020లోనే రూ.20,096 కోట్లతో డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. హైదరాబాద్‌లోని చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ మూడు డాటా సెంటర్ల మొదటి దశ పూర్తయ్యి వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మరింత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
అమెజాన్ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. హెచ్ఐసీసీలో జరిగిన ఎంపవర్ ఇండియా కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఇదొకటని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నదని వెల్లడించారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నదని, సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నామని వివరించారు. అమెజాన్ భారీ పెట్టుబడులతో డాటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవగాహనతో ఉన్నదని, వీటిని ప్రభుత్వ శాఖల్లో వినియోగించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ‘అమెజాన్ పెట్టుబడుల ద్వారా ప్రోగ్రెసివ్ డాటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ-గవర్నెన్స్, హెల్త్ కేర్, మున్సిపల్ ఆపరేషన్స్ జరిగి రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతారు. స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్స్, ఎంటర్ప్రైజెస్ రంగం, ప్రభుత్వ విద్యాసంస్థలు, ఎన్జీవోలు వారి అప్లికేషన్స్ వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. డాటా అనలెటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లర్నింగ్, ఏఐలో వీటిని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లకు ప్రయోజనం కలుగుతుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అమెజాన్ తన అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా ముందు నుంచీ హైదరాబాద్‌నే ఎంచుకొన్నది. తనకున్న ఆనేక రకాల వ్యాపారాలకు కేంద్రంగా ఈ నగరాన్ని మార్చుకొన్నది. ఇక్కడున్న పారిశ్రామిక, వ్యాపార అనుకూల విధానాలు, సుస్థిర ప్రభుత్వం, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ప్రోత్సహించే ప్రభుత్వం వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతున్నది. ప్రపంచంలోనే తన అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్‌తో పాటు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేసింది. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకొంటున్నది.