హైదరాబాద్ సిటీబ్యూరో/రవీంద్రభారతి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణను దేశంలోనే అత్యద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లో రూ.2 కోట్ల ప్రభుత్వ సహకారంతో ఆధునీకరించిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్లూజే) కార్యాలయాన్ని, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంను బుధవారం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనపై కొందరు ఎన్నో కుట్రలు పన్నుతున్నారని, అవన్నీ తిరిగి వారికే తగులుతున్నాయని అన్నారు. నిజాయితీపరులకు తప్పకుండా న్యాయం జరుగుతుందనడానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నదని, అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు అందచేసిందని గుర్తుచేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం: నిరంజన్‌రెడ్డి
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. తక్కువ సమయంలో పాత్రికేయుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయమూర్తిగా, సంఘ సంస్కర్తగా, ఎమ్మెల్యేగా ఎన్నో పాత్రలను పోషించిన ఆయన గొప్ప మహనీయుడని ప్రశంసించారు. 12 మంది కవులు, సాహిత్యకారుల ద్వారా సురవరం ప్రతాపరెడ్డి సమాచారాన్ని సేకరించి సంకలనాలుగా రూపొందించామని, మూడో సంకలనంలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పొందుపర్చామని తెలిపారు. భవిష్యత్తులో పీహెచ్డీ చేసేవారికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. అంటరానితనం, బాల్యవిహాహాలు, సాంఘిక దురచాలకు వ్యతిరేకంగా పోరాడిన సురవరం గోల్కొండ పత్రికను స్థాపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్‌రెడ్డి, టీయూడబ్లూజే నాయకులు శేఖర్, విరాహత్ అలీ, సురవరం కుటుంబసభ్యులు విష్ణువర్దన్‌రెడ్డి, కపిల్ తదితరులుపాల్గొన్నారు.