హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహనతో ఉండాలని, అప్పుడే వాటిని సమర్థవం తంగా అడ్డుకోగలమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉన్నదని అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫామ్ (సీఏపీ) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
నేరాలను అరికట్టడంలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదనని, డయల్ 100 ద్వారా కేవలం 5-10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకుంటున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలు, మహిళలు వాటి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా సైబర్ అంబాసిడర్లను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
మహిళలను, పిల్లలను వేధించేవారిని షీటీమ్స్ పకడ్బందీగా అదుపులోకి తీసుకుంటున్నాయని ప్రశంసించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సైబర్ నేరాలు తగ్గే అవకాశం ఉన్నదని తెలిపారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీ శిఖాగోయెల్ మాట్లాడుతూ.. సైబర్ అంబాసిడర్లుగా శిక్షణ పొందేవారంతా.. నేర్చుకున్న కొత్త విషయాలను తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని కోరారు.
తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. గురుకులాల్లో కూడా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తామన్నారు. సీఏపీ కార్యక్రమం ద్వారా 33 జిల్లాలోని 2,381 పాఠశాలల నుంచి 9,424 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు విడతలవారీగా సైబర్ నేరాల నివారణపై వర్చువల్ శిక్షణను ప్రారంభించారు. దీనికి రెండువేల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, జూమ్ లైవ్ 2 లక్షల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డీఐజీ సుమతి, కాంటినెంటల్ కాఫీ అధినేత రాజేంద్రప్రసాద్, అడిషనల్ ఎస్పీ, షీటీమ్స్, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.