Tourism Awards | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ కళలు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించగా, తాజాగా కేంద్ర పర్యాటకశాఖ ఈ సంవత్సరానికిగాను జనగామ జిల్లా పెంబర్తి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికచేసింది. ఈ నెల 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేయనున్నది.
హస్తకళలకు ప్రసిద్ధి పెంబర్తి
కాకతీయుల కాలం నుంచి ఈ గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి. ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి కళాకారులు రూపొందించే కళాకృతులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇకడి కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ లెకలు చెప్తున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇకడి కార్మికులు చేస్తున్న కృషి, తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్రం నిర్ణయించింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా గతంలోనే లభించింది.
‘గొల్లభామ’ చీరల కేంద్రం చంద్లాపూర్
రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, ఇకడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే, ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి అద్దం పడతాయి. గొల్లభామ చీర తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి మచ్చుతునక. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. గ్రామంలోని రంగనాయక సాగర్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యటక గ్రామంగా చంద్లాపూర్ నిలవడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం ప్రకటించారు. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.