హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీయూఎస్ మద్దతుతో పోటీ చేసిన ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ తరపున పోటీ చేసిన చెన్నకేశవరెడ్డిపై 1,456 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్న మొత్తం 29,720 ఓట్లకు 25,868 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 452 ఓట్లు చెల్లుబాటు కాలేదు. బరిలో 21 మంది నిలిచారు. 16న గురువారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా, అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో ఫలితం తేలలేదు. దీంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మూడో స్థానంలో ఉన్న మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండో స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సర్దుబాటు చేశారు. సర్దుబాటు అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.