హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): ఉపాధి లేక ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆటోడ్రైవర్ల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆటోడ్రైవర్ల కుటుంబాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 27న ఇందిరాపార్కు వద్దనున్న ధర్నాచౌక్‌లో ‘ఆటో ఆకలికేకలు’ పేరిట భారీ సభను నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ (టీఏడీయూ) అధ్యక్షుడు ఎం రవికుమార్ వెల్లడించారు. టీఏడీయూ ఆధ్వర్యంలో ఇటీవల ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పలుచోట్ల రోడ్డుషోలు నిర్వహించారు.
అందు లో భాగంగా రవికుమార్ హైదరాబాద్ చేరుకోగా.. బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య నాచారంలో ఆటో ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రవికుమార్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 27న ధర్నాచౌక్‌లో ఆటో ఆకలికేకలు మహాసభ పెద్దఎత్తున నిర్వహించబోతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షలకుపైగా ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.
ఉపాధి లేక డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఆటోడ్రైవర్లంటే సీఎంకు లెక్కేలేదని విమర్శించా రు. ఈ నెల 27 ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో జరగబోయే మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య, ఏఐటీయూసీ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ వెంకటేశ్వర్లు, టీయూసీఐ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఉయ్యాల ప్రవీణ్, బీఎంఎస్ ఆటో యూనియన్ కేంద్ర ప్రధానకార్యదర్శి రవిశంకర్ అల్లూరి, సీఐటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ పుప్పాల, టీఏడీడబ్ల్యూ అధ్యక్షుడు ఎంఏ సలీ, సత్తిరెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి రాంరెడ్డి హాజరవుతారని తెలిపారు.
తాము సభలు నిర్వహించాలనుకున్న ప్రతిసారీ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని ఆశజూపి సభ వాయిదా వేసుకునేలా చేస్తున్నారని విమర్శించారు. ఈసారి కచ్చితంగా పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే వరకు కలిసికట్టుగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.