రాజన్న సిరిసిల్ల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఆటోడ్రైవర్లు కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు పార్టీ తరఫున రూ.5లక్షల బీమా చేయిస్తానని, పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానంటూ ఇటీవల సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆటోడ్రైవర్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో రామన్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఆటోడ్రైవర్లను నమ్మించి బజారున పడేశాడని మండిపడ్డారు.
ఉపాధి కోల్పోయి రాష్ట్రవ్యాప్తంగా 161 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి చావులకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా తెలంగాణలోని ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.15వేల చొప్పున ఆరులక్షల మందికి ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.