హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు రేవంత్ సర్కారే కారణమని ఆటో యూనియన్ జేఏసీ నేతలు విమర్శించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు వెంకటేశ్ (ఏఐటీయూసీ), మారయ్య (బీఆర్టీయూ), సత్తిరెడ్డి (టీఏడీయూ) మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఏటా రూ.12 వేలు ఇస్తామని సర్కారు మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 5న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు రాష్ట్రంలోన ఆటో డ్రైవర్లంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12,000 ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని, ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఓలా, ఉబర్‌తో నడిపే టూవీలర్లను నిషేధించాలని, ఉచిత బస్సు వల్ల నష్టపోయిన డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండు చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆటో డ్రైవర్ల మహాధర్నాను నిర్వహిస్తామని జేఏసీ నాయకులు వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు.