మంచిర్యాలటౌన్, మార్చి 8 : ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. మంచిర్యాలలోని గర్మిళ్లలో నివసించే ఆటో డ్రైవర్ మర్యాద బాబు అలియాస్ చంద్రమౌళి (48) పదిహేనేండ్లుగా ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదాయం తగ్గడం, కుటుంబ పోషణ భారంతో కుమిలిపోయాడు.
ఈ నెల ఒకటిన పురుగుల మందు తాగాడు. వారం పాటు ప్రాణాలతో పోరాడిన బాబు చివరికి ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆటో యూనియన్ నాయకులు బాబు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.