ఖిలావరంగల్/నల్లబెల్లి, జూన్ 17: రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఆర్థిక భారంతో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ ఉడుత శివప్రసాద్ (28) రైలు కింద పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం నల్లబెల్లికి చెందిన శివప్రసాద్.. అదే గ్రామానికి చెందిన రచనను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శివప్రసాద్ తల్లి ప్రతీ సంతకు వెళ్లి అల్లం వెల్లుల్లి విక్రయిస్తుంది.
కుటుంబాన్ని పోషించుకునేందుకు శివప్రసాద్ ఓ ఆటో అద్దెకు తీసుకుని మల్లంపల్లి నుంచి నల్లబెల్లి వరకు ప్యాసింజర్లను తీసుకెళ్లేవాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టడంతో ఆటో ఎక్కేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అదే ఆటోలో తన భార్యతో కలిసి ఊరూరా తిరుగుతూ అల్లం వెల్లుల్లిని విక్రయించే వ్యాపారం మొదలు పెట్టాడు. అయినప్పటికీ గిట్టుబాటు కాకపోవడంతో, ఆర్థిక భారంతో నిత్యం కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మంగళవారం కాజీపేట-వరంగల్ రైల్వే స్టేషన్ మధ్య గేట్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. దీంతో నల్లబెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఉడుత శివప్రసాద్ మరణంతో నల్లబెల్లి ప్రజానీకం దిగ్భ్రాంతి చెందారు. ఏడాదిన్నర క్రితం వరకు పచ్చగా ఉన్న కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చిచ్చుపెట్టిందని ఇరుగుపొరుగు ఆరోపించారు. ఆటో నడుపుతూ భార్య, పిల్లలను అల్లారుముద్దుగా చూసుకున్న శివప్రసాద్ మనస్తాపం చెందాడని స్థానికులు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంతోనే శివప్రసాద్ ఉపాధికి గండికొట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తమకు ఇస్తామన్న ఏడాదికి రూ.12వేలు కూడా ఇవ్వకపోవడం దారుణమని ఖిలావరంగల్, నల్లబెల్లి స్థానిక ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు.