Nizamabad | వినాయక్‌నగర్, నవంబర్ 18: నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ భర్త శేఖర్‌పై ఓ యువకుడు దాడి చేసి గాయపర్చాడు. పైగా ఈ తతంగాన్నంతా రికార్డు చేయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, నిందితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దండు శేఖర్ సోమవారం సా యంత్రం నాగారం 80 క్వార్టర్స్‌లోని ఓ మెడికల్ షాపు వద్ద తన అనుచరులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన ఆటోడ్రైవర్ షేక్ రసూ ల్ అకస్మాత్తుగా శేఖర్‌పై దాడి చేశాడు. అతడు కిందపడిపోగా కాలితో తన్నా డు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఆటోలో నుంచి పెద్ద సుత్తె తీసుకొచ్చి కొట్టాడు. తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ సుత్తె కణత భాగం లో బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది.
రక్తస్రావంతో కిందపడిపోయిన శేఖర్‌ను స్థానికులు ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరించి, దానితోపాటు మరో సెల్ఫీ వీడియోను కూడా రసూల్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. తన భూమిని శేఖర్ కబ్జా చేశాడని, చాలాసార్లు బతిమాలినా వినలేదని రసూల్ తెలిపాడు. గోపాల్ అనే వ్యక్తి తన భూమిలో కబ్జా పెట్టాడని, వారి వద్దకు వెళ్తే 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. ఆటో నడుపుకొనే తాను అంత ఇచ్చుకోలేనని, అందుకే తాను శేఖర్‌పై దాడి చేశానని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.