జహీరాబాద్ ; మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు బలవంతంగా భూసేకరిస్తుండటంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మామిడ్గి రైతు వేదికలో జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో భూసేకరణపై గ్రామసభ నిర్వహించారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం 1169 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని, పట్టాభూములకు ఎకరానికి 15 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేయగా వారు అభ్యంతరం తెలిపారు. కొందరు రైతులు ప్రాజెక్టుకు భూములు ఇస్తామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. –