హాజీపూర్/కాసిపేట/బెల్లంపల్లి, డిసెంబర్ 3 : బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటను అధికారులు, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే, ముల్కల్లలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను సందర్శించేందుకు మంగళవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకు డు చెన్నమల్ల చైతన్య నాయకులతో కలిసి వెళ్లారు. విద్యాలయాల్లోకి వెళ్లకుండా ప్రిన్సిపాళ్లు అడ్డుకోగా, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయాచోట్ల ప్రధాన ద్వారాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసిపేట మండలం రేగులగూడ ఆశ్రమ పాఠశాల, బెల్లంపల్లిలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల,కళాశాల సందర్శనకు బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్.. నాయకులతో కలిసి వెళ్లగా హెచ్ఎం, సిబ్బంది లోపలికి రాకుండా తాళాలు వేయడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల గేటు ముందు ధర్నా చేశారు. సిబ్బంది గేట్‌కు తాళం వేయడంపై మండిపడ్డారు.