హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా సంక్షేమం బాగుందని ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసింది. ఇక్కడ అమలవుతున్న పథకాలపై ప్రశంసలు కురిపించింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ పథకాలను వివరించారు. మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ఇంతలా కృషి చేస్తున్న ప్రభుత్వంలో కలిసి తాము పని చేయాలని కోరుకుంటున్నట్టు ఆస్ట్రేలియా బృందం పేర్కొన్నది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రతిపాదనలు అందజేస్తామని చెప్పింది. మంత్రిని కలిసిన వారిలో రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే ఆసియా పసిఫిక్ వాణిజ్య కమిషనర్ నీలిమా దరి, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ జోడి మెకే, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ డెబోరా స్వీనీ తదితరులు ఉన్నారు.
‘మహా’ బంజారా సమావేశానికి సత్యవతి
మహారాష్ట్రలోని వాసిం జిల్లా పోరియాగఢ్లో బుధ, గురువారాల్లో బంజారాల జాతీయస్థాయి భారీ సభ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బంజారాలు హాజరుకానున్నారు. తమ కుల గురువు, ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సమాధిని సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఆమెను పోరియాగఢ్కు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు సింపల్ రాథోడ్, బంజారా జాతీయ జేఏసీ ప్రధాన కార్యదర్శి అంబు నాయక్, రాంబల్ నాయక్ మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. పోరియాగఢ్ను బంజారాలు కాశీగా పరిగణిస్తారు.