సిడ్నీ, మే 24: ఈ నెలలో బెంగళూరులో తమ కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల అనంతరం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ బెంగళూరులో కాన్సులేట్ ఏర్పాటుతో ఇరు దేశాల మధ్య వ్యాపార అభివృద్ధితో పాటు డిజిటల్, నూతన పర్యావరణ వ్యవస్థలు మరింత పటిష్టం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బెంగళూరులో ఆస్ట్రేలియా ప్రారంభించే కాన్సులేట్-జనరల్ భారత్‌లో ఐదవది. ఇప్పటికే కాన్సులేట్లు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో ఉన్నాయి. కాగా, భారత్‌కు చెందిన కాన్సులేట్లు ఆస్ట్రేలియాలో మూడు ఉన్నాయి. భారత్-అస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపర్చుకునే కార్యక్రమంలో భాగంగా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన మిషన్‌ను భారత్‌లో కూడా ఏర్పాటు చేస్తామని మన ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనలో ప్రకటించిన 24 గంటల లోపే ఆస్ట్రేలియా ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం.