SCR | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పేరు మార్పును అధికారికంగా అమలు చేస్తున్నామని.. స్టేషన్‌లోని అన్ని సైన్‌బోర్డులు, టిక్కెట్లు, ప్రకటనలు డిజిటల్ సిస్టమ్స్‌లో కొత్త పేరును అప్డేట్ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. స్టేషన్‌కు కొత్త కోడ్‌ను ‘CPSN’ అని తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు, హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే పేర్కొంది. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీని గౌరవించే లక్ష్యంతో ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌కు కొత్త పేరును మార్చినట్లు పేర్కొంది.
పేరు మార్పు తర్వాత స్టేషన్‌కు సంబంధించిన అన్ని సమాచారం, టికెట్లను కొత్త పేరుతోను ప్రయాణికులకు జారీ చేయనున్నట్లు రైల్వే అధికారుల తెలిపారు. ఇకపై స్టేషన్ పేరు ‘ఛత్రపతి శంభాజీనగర్’గా అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్ల ప్రకటనల్లో వినిపిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతంలో 2022లో ఔరంగాబాద్ నగరం పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా రైల్వే స్టేషన్ పేరు మార్చడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న పేరు మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
మూడు సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, మరాఠా రాజ్యానికి రెండో పాలకుడు అయిన ఛత్రపతి శంభాజీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్‌కు గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేఉ ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ప్రారంభించారు. ఛత్రపతి శంభాజీనగర్ ఒక పర్యాటక కేంద్రం. నగరం చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇందులో అజంతా-ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది.