Congress Party | హైదరాబాద్, ఫిబ్రవరి 1( నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో రగులుతున్న అసంతృప్తి కుంపటి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మ రింతమంది జతకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. శనివారం వరంగల్ జిల్లాకు చెందిన మరో ముగ్గు రు ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేతలతో జత కలిశారని ప్రచారం జరుగుతున్నది. దీంతో తిరుగుబాటుదారుల సంఖ్య 13కు చేరినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్-2గా చెప్పుకుంటున్న మంత్రిని టార్గెట్‌గా చేసుకొని తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం. పార్టీని కాపాడుకోవడానికి నోరు విప్పాల్సిందేనని, రూ.కోట్లకుకోట్ల డబ్బు మూటలతో వచ్చి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాలనుకునే వారిని పార్టీ నుంచి బయటికి పంపే వరకు వెనక్కి తగ్గవద్దని, త్వరలోనే రాహుల్‌గాంధీని కలిసి ఫిర్యాదుచేయాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిర్ణయించినట్టు తెలిసింది. ఒక మంత్రి వసూళ్ల దందా మీద తిరుగుబాటు చేస్తూ, పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ ‘కాంగ్రెస్‌లో కుంపటి’ శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌లో దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఎమ్మెల్యే శపథం
వ్యాపారం చేసుకునే వాళ్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలోకి వెళ్లిపోతారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఆర్థిక అంశంతో కూడిన పాలనాపరమైన ప్రతిపనికీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని, భూ వివాదాలపై ఎటువంటి ఫైల్ తీసుకెళ్లినా ఒక మంత్రి 30% వాటా అడుగుతున్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. సదరు మంత్రిని థర్టీ పర్సెంట్ మంత్రిగా నామకరణం చేస్తున్నట్టు, భవిష్యత్తులో నిర్వహించే మీడియా సమావేశాల్లో ఆయనను ‘థర్టీ పర్సెంట్ మంత్రి’గానే సంబోధించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మద్దతుగా వెళ్లిన వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, తొలిసారి ఎమ్మెల్యే అయిన నేత ఒకరు ‘థర్టీ పర్సెంట్ మంత్రి’.. మంత్రిగా ఉన్నంతకాలం ఆయన పేషీలోకి అడుగుపెట్టనని శపథం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా, నియోజవర్గాలకు రూపాయి ఎమ్మెల్యే ఫండ్ రాలేదని, కానీ ఆయనకు మాత్రం రూ.వేల కోట్ల కాంట్రాక్టు బిల్లులు చెల్లిస్తున్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
కీలక నేతల చేతికి ఆడియో క్లిప్పింగ్‌లు
అసంతృప్త నేతలు శుక్రవారం రాత్రి సమావేశమైన నేపథ్యంలో వారి మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్పింగ్‌లు బయటికి వచ్చినట్టు తెలిసింది. ఆ క్లిప్పింగ్‌లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలకు అందాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌పై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశారని సీఎం కార్యాలయ వర్గాలు చెప్పినప్పటికీ, తిరుగుబాటు ఎమ్మెల్యేల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరం లేకుండా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్టు సమచారం. త్వరలోనే ఎమ్మెల్యేల ఫండ్ విడుదల మీద ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిసింది.
కోహినూర్‌లో కలిశారు: మల్లు రవి
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారనే ప్రచారంపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిశారని, అందులో తప్పేమున్నదని ప్రశ్నించారు. వారు ఫామ్‌హౌజ్‌లో భేటీ కాలేదని, డిన్నర్ పార్టీ కోసం కోహినూర్ హోటల్లో కలుసుకున్నారని, అందు లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూడా ఉన్నారని తెలిపారు. అది ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా జరిగిన సమావేశం కాదని పేర్కొన్నారు.
కేసీఆర్ ముందే గమనించి తరిమేస్తే..
తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర పార్టీ పెద్దకు, మరో మంత్రికి అప్పగించినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త, యువ ఎమ్మెల్యే ఒకరు తిరుగుబాటుకు నాయకత్వం వహించినట్టు కాంగ్రెస్ పెద్దలు గుర్తించి ఆయనతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ‘థర్టీ పర్సెంట్ మంత్రి’ మీద పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పిన తరువాతే తమతో మాట్లాడాలని, సదరు మంత్రిని తమ ముందుకు పిలిపించి నిగ్గుతేల్చాలని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. కేసీఆర్ రాజకీయంగా తెలివైన నేత అని, ఈ మంత్రి మోసాలను ముందుగానే పసిగట్టి పార్టీ నుంచి బయటికి పంపించేశారని, మనకు దిక్కులేక నెత్తికి ఎత్తుకున్నామని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నేతల పెండింగ్ ఫైళ్లు వెంటనే క్లియర్ చేస్తున్నారని, వారికే పార్టీ సలహాదారు పదవులు కట్టబెడుతున్నారని, వారి అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని తిరుగుబాటు నేతలు ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. పార్టీని నమ్ముకున్నందుకు మళ్లీ పోటీ చేస్తే ప్రజలు ఛీ కొట్టే స్థితికి తీసుకొచ్చారని పార్టీ పెద్దతో అన్నట్టు తెలిసింది.