హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘రండి బాబూ రండి.. ఇదే మంచి అవకాశం.. వేలంలో డబ్బు కొట్టండి.. మీకు కావాల్సిన చోటకు పోస్టింగ్ పట్టండి.. అన్నట్టుగా సాగుతున్నది ఎక్సైజ్‌శాఖలో పోస్టింగ్‌ల వ్యవహారం. రాష్ట్రంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్ల పోస్టులను ప్రభుత్వమే బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మేసిందా? ఫోకల్ పోస్టులుగా గుర్తింపు ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఏకంగా వేలంపాట పెట్టారా? దాదాపు 24 పోస్టులను ఒక్కో అధికారి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పాడి వేలంలో సొంతం చేసుకున్నారా? అందుకే వాళ్లు హైదరాబాద్ చుట్టూ ఉన్న పోస్టుల్లో ఇమిడిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రభుత్వం కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి లాంటి విలువైన భూములను మాత్రమే కాదు.. విలువైన ఎక్సైజ్ పోస్టులను కూడా వేలం వేసినట్టు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కానిస్టేబుళ్ల బదిలీల్లో మాత్రం అవినీతి అభియోగంతో వారి మీద 8ఎఫ్ అమలు చేసిన ప్రభుత్వం, ఆ శాఖ ఉన్నతాధికారుల వద్దకు వచ్చేసరికి ఏకంగా వేలం పాట పెట్టినట్టు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు,అధికారులకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లోచర్చ జరుగుతున్నది.
నిరుడు డిసెంబర్లోనే ఎక్సైజ్ శాఖలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చారు. కానీ ఈ 68 మందికి జూన్ నెల వరకు పోస్టింగులు ఇవ్వలేదు. జూన్ మాసంలో ఈ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో ఈశాఖ కమిషనర్ హరికిరణ్ అధికారుల పనితీరు, గతంలో పని చేసిన స్టేషన్, ప్రభుత్వానికి తెచ్చిన రెవెన్యూ అనే నిబంధనలు పెట్టుకొని వాటి ఆధారంగా వెరీగుడ్, గుడ్, బ్యాడ్ అనే మూడు క్యాటగిరీలుగా విభజించినట్టు తెలుస్తున్నది. దీని ఆధారంగా ఫోకల్ టు నాన్ ఫోకల్, నాన్ ఫోకల్ టు ఫోకల్ కింద బదిలీల ప్రతిపాదనలు ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపినట్టు సమాచారం. ప్రిన్సిపల్ సెక్రటరీ తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కమిషనర్ పంపిన జాబితాలో ఒకటి అర మార్పులు చేసి ఆ ఫైలును కీలక మంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలిసింది.
ఇక్కడే అసలు కథ మొదలు..
ఈ ప్రతిపాదనలను మంత్రి కార్యాలయం యథాతథంగా ఆమోదిస్తే గందరగోళం ఉండేది కాదు. కమిషనర్ పంపిన ప్రతిపాదనల కాపీని ఉద్దేశపూర్వకంగానే మంత్రి కార్యాలయం ఎక్సైజ్ అధికారులకు వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ ప్రతిపాదన ప్రకారం ఎవరికి ఏ పోస్టు వస్తుందో ఆయా అధికారులకు ముందే తెలిసిపోయింది. అదే సమయంలో బదిలీల ప్రక్రియను కూడా దాదాపు 13 రోజులు పక్కన పెట్టారు. ఈ వెసులుబాటుతో అధికారులు పైరవీల కోసం మంత్రి కార్యాలయానికి ఎగబడినట్టు తెలిసింది. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు, మహబూబ్‌నగర్ తదితర ఫోకల్ పోస్టుల్లో పని చేసి ఆర్థికంగా బలపడ్డ అధికారులే తాజాగా మళ్లీ పైరవీలు చేసుకున్నట్టు తెలిసింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటూ క్యూర్ పరిధిలోని పోస్టులకు ప్రధానంగా పోటీ వచ్చినట్టు సమాచారం. పోటీ పెరగటంతో మంత్రి కార్యాలయం వేలం పాటలు పెట్టినట్టు చెప్తున్నారు. సెంటర్ స్థాయిని బట్టి ఒక్కో అధికారి రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేలం పాడి పోస్టులు దక్కించుకున్నట్టు తెలిసింది.
అనుమానిత పోస్టులు ఇవే..
రంగారెడ్డి, సంగారెడ్డి, క్యూర్ సిటీ పరిధి, హైదరాబాద్‌లలోనే ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డీసీ రంగారెడ్డి, డీసీ క్యూర్, డీసీ మల్కాజిగిరి, డీసీ మహబూబ్‌నగర్, డీసీ సంగారెడ్డి, డీసీ సైబరాబాద్, ఏసీ రంగారెడ్డి, ఏసీ సంగారెడ్డి, ఏసీ మల్కాజ్గిరి, ఏసీ సైబరాబాద్, ఏసీ హైదరాబాద్, ఈఎస్ ఎల్బీ నగర్, ఈఎస్ శేరిలింగంపల్లి, ఈఎస్ కుత్బుల్లాపూర్, ఈఎస్ మల్కాజిగిరి, ఈఎస్ సంగారెడ్డి, ఈఎస్ సికింద్రాబాద్, ఈఎస్ ఫ్యూచర్‌సిటీ, ఎన్ఫోర్స్మెంట్ సంగారెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మలాజిగిరి, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ మల్కాజ్గిరి, ఎన్ఫోర్స్మెంట్ ఫ్యూచర్‌సిటీ, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ తదితర పోస్టుల మీదనే ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతున్నది. ఇదే తరహాలో ఎక్సైజ్ ఎస్ఐ, సీఐ, ఏఈఎస్ పోస్టులకు కూడా వేలం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.