హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ)కి చెందిన ఆస్తులను వేలం వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలని పేర్కొంది. డీఎఫ్ఐ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు వారి పెట్టుబడుల దామాషా ప్రకారం వేలం సొమ్మును పంపిణీ చేయాలని తెలిపింది. తద్వారా తెలంగాణ, ఏపీలకు చెందిన సుమారు నాలుగు వేల మందికిపైగా బాధితులకు ఉపశమనం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రధాన ప్రదేశాల్లో రూ.500 కోట్ల విలువైన డీఎఫ్ఐ ఆస్తులున్నాయి. అధిక రాబడి ఉంటుందని నమ్మించి పలువురి నుంచి డీఎఫ్ఐ పెట్టుబడులు స్వీకరించింది.
తొలుత జనాన్ని ఆకట్టుకునే క్రమంలో తొలుత అధిక మొత్తాలను తిరిగి చెల్లించిన డీఎఫ్ఐ ఆ తరువాత చేతులెత్తేసింది. దీంతో బాధితులు 2023లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఆగస్టు 2025లో డీఎఫ్ఐ ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశించింది. కాగా ఆస్తుల జప్తు ఉత్తర్వులను, డీఎఫ్ఐ సంస్థ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను విచారించిన జస్టిస్ కే సుజన పైవిధంగా ఉత్తర్వులు జారీచేశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఆస్తులను జప్తుచేశారని డీఎఫ్ఐ సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు ప్రతివాదన చేస్తూ.. డీఎఫ్ఐ సంస్థ ప్రజల నుంచి సుమారు రూ.762 కోట్లు వసూలు చేసిందని, కానీ ఆ సంస్థ రూ.516 కోట్లను మాత్రమే వసూలు చేసినట్టు అంగీకరించిందని చెప్పారు. అమాయకులను మోసం చేసిన డీఎఫ్ఐ అప్పీళ్లను కొట్టివేయాలని కోరారు. వాదనల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది.