యాదగిరిగుట్ట, మే 28: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేసే సురక్షా సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి చింతపండు బస్తాలను దొంగిలించేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు డీఈవో భాస్కర్శర్మ మీడియాకు వెల్లడించారు. కొండపైన స్వామివారి ప్రసాదవిక్రయశాలలోని గోదాంలో పులిహోరలో వినియోగించే 30 కిలోలు గల 10 బస్తాల చింతపండును మధు, గణేశ్ అనే సురక్షా సిబ్బంది కన్వేయర్ బెల్టు సాయంతో కారులో వేసుకుని బయటకువెళ్లే ప్రయత్నంచేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా కారుతోపాటు చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు. యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఈవో వెల్లడించారు.
దేవస్థానానికి సంబంధించిన చింతపండు దొంగతనంలో ఆలయ ఉన్నతస్థాయి అధికారుల హస్తం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి ఆరోపించారు. బుధవారం కొండపైన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. అర్ధరాత్రి గోదాం, ప్రసాద తయారీ కేంద్రాల తలుపులు, తాళాలు తీసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన కారు అర్ధరాత్రి కొండపైకి ఎలా వెళ్లిందో ఆలయ అధికారులు విచారణ చేపట్టాలని తెలిపారు. దేవస్థాన ఉన్నతస్థాయి అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎన్నేళ్లుగా చింతపండు దొంగతనం జరుగుతుందో విచారించాలన్నారు. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండుకే రక్షణ లేకపోవడం చూస్తుంటే స్వామివారికి సమకూరిన బంగారం, వెండి నగల రక్షణపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందన్నారు.