అక్కన్నపేట, డిసెంబర్ 31: తమకు పరిహారం అందలేదంటూ ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం చోటుచేసుకున్నది. అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన నందారం వెంకటయ్య పేరిట ఎకరం పది గుంటల భూమి గౌరవెల్లి రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. నిబంధనల ప్రకారం పరిహారం చెల్లింపులు జరిగాయని అధికారులు పేర్కొంటుండగా, బాధితుడి మనుమడు నందారపు సంపత్ మాత్రం తమకు పరిహారం అందలేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. తహసీల్దార్ అనంతరెడ్డి బయటకు వచ్చి సంపత్ చేతిలో ఉన్న పురుగు మందు డబ్బాను లాక్కొన్నారు. తమ భూమికి రావాల్సిన పరిహారం ఇతరులకు ఇచ్చారని సంపత్ ఆరోపిస్తున్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకొని రెవెన్యూ అధికారుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.