అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 14 : నాగర్కర్నూల్ జిల్లాలో శిశువును విక్రయానికి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అచ్చంపేట మండలం కిష్టతండాకు చెందిన వడియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు దవాఖానలో లక్ష్మి మళ్లీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటం.. మూడో సంతానంగా పుట్టిన కన్నబిడ్డను పోషించే స్థోమత లేకపోవడంతో శిశువును అమ్మకానికి పెట్టాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అచ్చంపేట పాత బస్టాండ్లో శిశువు అమ్మకం విషయమై రూ.2.50 లక్షల బేరం పెట్టారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ విషయం బహిర్గతమైంది. ఇంటలిజెన్స్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ సభ్యులకు సూచించారు. వెంటనే స్పందించిన వారు తండాకు వెళ్లారు. సర్పంచ్ ధర్మానాయక్తోపాటు పెద్ద మనుషులతో చర్చించి ఆ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవడంతో అమ్మకానికి బ్రేక్ పడింది.