Bandi Sanjay | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కొడుకుపై పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బహిరంగసభలో ధర్మపన్నాలు వల్లెవేశారు. తన కొడుకు భగీరథ్ సభ్యసమాజం తలదించుకునేలా చేసిన నేరాన్ని మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ తప్పులను సొంతంగా ఎదుర్కోలేక పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
సభా వేదిక నుంచి నేనేం తప్పు చేయలేదని, ఏ రోజూ పార్టీ తలవంచుకునే పనిచేయనని నిస్సిగ్గుగా బుకాయింపు మాటలను పదేపదే చెప్పుకొన్నారు. ధర్మం పేరుతో అసత్యాలనే వల్లిస్తూ కార్యకర్తలను రెట్టగొట్టేలా మాట్లాడిన తీరు విస్తుగొలిపింది. ఎప్పుడూ పార్టీకోసమే పనిచేస్తానని, తన కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూనే పార్టీ మద్దతు దిశగా మొసలి కన్నీరు కార్చారు.
ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, యువమోర్చా కార్యకర్తగా జెండాలు మోసి ఈ స్థాయికి వచ్చానని తన తప్పులకు మద్దతు కూడగట్టేలా సెంటిమెంట్ డైలాగ్లతో నమ్మించే ప్రయత్నం చేశారు. పోక్సో కేసు నమోదైన తన కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లినా.. ఆరోపణలను కప్పిపుచ్చుతూ తప్పంతా వ్యవస్థదేనని, విపక్షాలదేనన్నట్టుగా వ్యవహరించడం కేంద్ర సహాయమంత్రి హోదాకు అప్రతిష్ఠేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకు చేసిన నేరాన్ని హుందాగా ఒప్పుకోకుండా బుకాయింపు మాటలతో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ తలవంచే పని చేయనంటూనే.. ‘నన్ను నమ్మండన్నా’ అంటూ సభికులకు రెండు చేతులెత్తి ప్రాధేయపడటం గమనార్హం. తప్పుడు ప్రచారాన్ని నమ్మకండని వేడుకోలుగా సమర్థించుకునే వ్యాఖ్యలు చేశారు