హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కంటికి కనిపించని బ్యాక్టీరియాలు సృష్టిలోని ఎన్నో జీవులను కాలగర్భంలో కలిపేస్తున్నాయి. అంతు చిక్కని వ్యాధులను తెచ్చిపెడుతూ మానవ మనగడకే సవాలుగా మారుతున్నాయి. ఆధునిక వైద్య విధానాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అంతే వేగంగా తమ రూపాలను మార్చుకొంటూ సామర్థ్యాన్ని పెంచుకొంటున్నాయి. దీంతో జీవకణాలపై వాటి దాడిని యాంటీ బయాటిక్స్ సమర్థంగా నిలువరించలేకపోతున్నట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనంలో వెల్లడైంది.
వాస్తవానికి ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానవాళికి సాయపడతాయి. కానీ, వ్యాధికారక బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు ఒకే రకమైన యాంటీ బయాటిక్స్ను అధిక మోతాదులో తీసుకుంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియాకు ముప్పు వాటిల్లుతున్నట్టు తేలింది. దీంతో అన్ని రకాల బ్యాక్టీరియాకు ఒకే రకమైన డ్రగ్ పనిచేయదని, ఒక్కో రకమైన బ్యాక్టీరియాకు ఒక్కో రకమైన మందు వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.