కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/గంగాధర : బీఆర్ఎస్ కార్యాలయాల్లోకి వచ్చి మరీ ఆ పార్టీ నేతలను కొడతామంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇటీవల చేసిన హెచ్చరికల నేపథ్యంలో అతని అనుచురులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం సాయంత్రం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడికి యత్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని వీధుల్లో పరుగులు తీస్తూ సుంకె రవిశంకర్ ఇంటిపై దాడి చేసేందుకు వారు విఫలయత్నం చేశారు. వారు వీధుల్లో వీరంగం సృష్టిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. పోలీసులు వారిని వెంబడించి దాడి జరగకుండా అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గత సోమవారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లోకి వెళ్లి మరీ వారిని కొడతామని హెచ్చరించారు. కరీంనగర్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రవిశంకర్ చేసిన పలు వ్యాఖ్యలను చొప్పదండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కానీ, అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు రవిశంకర్ ఇంట్లో లేని సమయం చూసి ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డగిస్తున్నా ఆగకుండా ఇంటి గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. రవిశంకర్ కు టుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. తమ ఇంటిపై దాడి జరుగుతున్నదని భయంతో కేకలు వేశారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మేడిపల్లికి అనుకూలంగా నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దాడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు యజ్ఞేశ్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి వదిలేసినట్టు తెలిసింది.
తన ఇంటిపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించడంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించానని.. కానీ, కాంగ్రెస్ మాత్రం తన ఇంటిపై దాడికి దిగిందని మండిపడ్డా రు. ఎమ్మెల్యే సత్యం ప్రోద్బలంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించి దాడికి యత్నించి, తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తనతో పోరాడాలని, దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ‘చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయ డం దుర్మార్గం.. రేవంత్రెడ్డి ముఠా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్నారనే నెపంతో ఇలాంటి దురాగతాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. అడుగడుగునా కాంగ్రెస్ మోసాలు, అవినీతిని ఎండగడతామని గురువారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడుతూ అరాచకాలు సృష్టిస్తున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా దాడులకు ముగింపు పలకాలని లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డీజీపీ వెంటనే స్పందించి కాంగ్రెస్ అల్లరిమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.