ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో కొందరు కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్రామంలో తనిఖీలు నిర్వహించడానికి వెళ్లారు. పలు ఇళ్లలో కలప నిల్వలు ఉండగా అధికారులను లోనికి రానీయకుండా స్థానికులు అడ్డుకున్నారు. కొందరు అధికారులు, వాహనాలపై దాడిచేశారు. ఇచ్చోడ పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో కొందరు కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి రూ.3.50 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నట్టు ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ పాటిల్ తెలిపారు. అధికారుల తనిఖీలతో స్థానికులు ఆందోళన చెందారని, ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారు.