ధర్మారం, మే 20: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ధర్మారం మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించడంతో పాటు చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు ఇటీవల సవాల్ విసిరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించి, మంగళవారం ధర్మారంలోని అంబేదర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
ఈ మేరకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూస్కూరు రామారావు, పాకాల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, మహిళా నాయకురాలు ఆవుల లత, గుజ్జేటి కనకలక్ష్మి, మార సంధ్య, దేవి రేణుక కాంపల్లి అపర్ణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు రామారావు ఇంటి నుంచి ర్యాలీగా అంబేదర్ చౌరస్తాకు బయలుదేరారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ర్యాలీ గా వెళ్తున్న పలువురు ముఖ్య నాయకులను అడ్డుకున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు అంబేదర్ చౌరస్తాకు చేరుకున్నారు. కరీంనగర్ -రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. కాగా, సీఐ మాత్రం మిగతా ముఖ్య నాయకులను కేడీసీసీ బ్యాంకు వద్ద నిలిపివేసి, అంబేదర్ చౌరస్తాకు వెళ్లవద్దని సర్దిచెప్పారు. సీఐ విజ్ఞప్తి చేయడం, పార్టీ ముఖ్య నాయకుల పిలుపు మేరకు అంబేదర్ చౌరస్తాలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కేడీసీసీ బ్యాంకు వద్దకు చేరుకున్నారు.
అక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించారు. ఇరువర్గాలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ – రాయపట్నం రహదారిపై గంటసేపు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పాత బస్టాండ్ వైపు, కాంగ్రెస్ నాయకులను అంబేదర్ చౌరస్తా వైపునకు మళ్లించారు.
ధర్మపురి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి యత్నించడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ర్టాన్ని పదేండ్లపాలనలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. నిజంగా కాంగ్రెస్ నాయకులకు నీతి, నిజాయితీ ఉంటే, ప్రజలు, తమ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మపురి ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని, తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర పైసలు లేవని, తనను కోసినా ఒక్క పైసా లేదని అంటున్నారని, దీనిని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థమైతున్నదని ఆగ్రహించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఏడాదిన్నరలో ఏం సాధించారో, ఏం పనులు చేశారో చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎందుకు రెచ్చిపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలను ఎవరూ క్షమించరని, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎలాంటి కక్ష సాధించలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో పదేండ్లలో చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ము లేక దాడికి దిగారు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం.
-రాచూరి శ్రీధర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు