హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు. ఆ పనులన్నీ అనధికారికంగా చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యాలయం హంగుల కోసం ఒక్కో యూనిట్‌కు టార్గెట్ విధించి వసూలు చేసినట్టు ఇంజినీర్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ అధికారే ఫైలుకో రేటు పెట్టి వసూళ్లకు తెరతీశాడని, తన చేతికి మట్టి అంటకుండా పేపర్ కోడ్లు, సీల్డ్ కవర్లతో వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని ఇరిగేషన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
అనుమతుల్లేకుండానే పనులు
సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రులకు గదులను కేటాయించారు. ఆ గదుల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా, అదనపు వసతులు సమకూర్చాలన్నా సంబంధిత పనులను ఆర్అండ్బీ శాఖ చేపట్టాలి. అందులో భాగంగా అసలు ఆ పని అవసరమో కాదో పరిశీలించి తొలుత అంచనాలు రూపొందించాలి. అనంతరం వాటికి సంబంధిత శాఖ కార్యదర్శి నుంచి ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందాక పనులను చేపట్టాలి. కానీ, ఇరిగేషన్ శాఖ పేషీలో ఓ ఉన్నతాధికారి బాధ్యతలు చేపట్టాక ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. అనధికారికంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పేషీని సర్వహంగులతో తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్అండ్బీ శాఖ తిరస్కరించినప్పటికీ ఎలాంటి అంచనాలు లేకుండానే ఆ అధికారి ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేట్ ఆఫీస్‌ను తలదన్నేలా..
సచివాలయంలో అన్ని శాఖల పేషీల్లో ఉద్యోగుల చాంబర్లు సాదాసీదాగానే ఉంటాయి. వాటిలో ఓపెన్ డెస్క్లే దర్శనమిస్తాయి. మంత్రుల పేషీల్లోనూ ఇంచుమించు ఇదేవిధమైన వసతులు ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ పేషీని మాత్రం కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా తీర్చిదిద్దారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో కూడా లేనివిధంగా ఆ పేషీలోని ప్రతి అధికారికీ ప్రత్యేక గ్లాస్ ఫిటింగ్, సౌండ్‌ప్రూఫ్ క్యాబిన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ఆ పేషీ కార్యాలయంలో సమకూర్చారు. అలా ఈ హంగుల కోసం మొత్తంగా రూ.కోటికి పైగానే నగదు వెచ్చించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక్కో సీఈ యూనిట్‌కు టార్గెట్ పెట్టి డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఫైలుకో రేటు.. పేపర్ కోడ్లు
అక్రమ వసూళ్లలోనూ ఇరిగేషన్ శాఖ పేషీ ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఆ పేషీలో బాధ్యతలు చేపట్టిన ఓ ఉన్నతాధికారి అప్పటివరకు అక్కడున్న పలువురు జేఈఈలు, డీఈఈలు, ఈఈలను బదిలీ చేసి తన అనుయాయులను తెచ్చిపెట్టుకున్నారు. ఆ పేషీకి వచ్చే ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్లు, నూతన ఎస్టిమేషన్లు సహా ప్రతి ఫైలుకూ ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు తెరలేపారు. తన చేతికి మట్టి అంటకుండా అనుయాయులతో పేపర్లపై కోడ్లు వేయించి మరీ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఆ పేషీలో ఎవరి వద్దకు ఎవరొస్తున్నారో? తెలియకుండా ఉండేలా క్యాబిన్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. ఆ ఉన్నతాధికారి తన ఫైళ్లనే కాకుండా ఇతర విభాగాల ఫైళ్లనూ డిక్టేట్ చేస్తున్నట్టు వినికిడి. ఓడీలు మొదలు పోస్టింగ్‌ల వరకు ఆ అధికారే చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా, సదరు ఉన్నతాధికారిపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇంజినీర్లు నెత్తీనోరు కొట్టుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు.