హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ముక్కు కండరాల వాపు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తున్నదని పరిశోధకులు తేల్చారు. ఆస్తమా రోగుల ముక్కు, చాతి నమూనాలను సేకరించి వాటి పనితీరును అంచనా వేసిన పరిశోధకులు, జంతువులకు ఆస్తమా సోకితే ప్రవర్తించే కండరాల పనితీరును కూడా విశ్లేషించారు. మనుషుల్లో కండరాలు వ్యాప్తి చెంది శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందని, దీర్ఘకాలం తర్వాత ఎన్నటికీ నయం కాని ఆస్తమాగా రూపాంతరం చెందుతుందని గుర్తించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఆస్తమా, వ్యాధి కారకాలపై జరిగిన అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)కు చెందిన డాక్టర్ భానుప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ సంతోషి ప్రాతినిధ్యం వహించారు. శ్వాసనాళాలు అనూహ్యంగా వాపు చెంది వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని గుర్తించారు. అనూహ్యంగా కండరాలు ప్రతిస్పందించడంతోనే ఆయాసం తీవ్రత పెరుగుతుందన్నారు. ఆస్తమా పేషెంట్ల నుంచి సేకరించిన శాంపిళ్లు, సాధారణ వ్యక్తుల ఊపిరితిత్తుల నమూనాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.