Assistant Professor | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా వర్సిటీల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కారమయ్యే ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఉండదని తెలుస్తున్నది. ఒకవేళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తే కొత్త నోటిఫికేషన్తో భర్తీచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు లెక్కలు వేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 869 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే 65 ఏండ్ల వయసు వచ్చేవరకు వారిని ఉద్యోగాల నుంచి తొలిగించే అవకాశం ఉండదు. ఆ లెక్కన ప్రస్తుతం 45 ఏండ్ల వయసున్న కాంట్రాక్టు అధ్యాపకులు రిటైర్ కావడానికి 20 ఏండ్లు, 50 ఏండ్ల వయసువారు రిటైర్ కావడానికి 15 సంవత్సరాలు, 55 ఏండ్ల వయసువారు రిటైర్ కావడానికి 10 ఏండ్లు పడుతుంది. ఈ విధంగా చూస్తే జీవో 21 ప్రకారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అందులో పోస్టులు తగ్గుతాయని ఉన్న విద్యామండలి అధికారులు నివేదిక రూపొందించి, ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు.
కొత్త నోటిఫికేషన్లో 402 పోస్టులే గతి
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 1,588 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 1,121 ఖాళీగా ఉన్నాయి. వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నది. యూనివర్సిటీ వీసీలు కూడా ఇదే చెప్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని నెరవేర్చితే కొత్త నోటిఫికేషన్లో 402 పోస్టులు మాత్రమే మిగులుతాయి. వాటినే క్లియర్ వెకెన్సీగా చూపిస్తారు. అందులో సింహాభాగం ఓయూలోనే ఉంటాయి. ఈ పోస్టుల వల్ల తమకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని పీహెచ్డీ పూర్తిచేసిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరకాటంలో పడిన ప్రభుత్వం.. ఇప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేయకపోవమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.