Telangana | అసైన్డ్ భూమి… అగ్రిమెంట్లు… ఎఫ్ఐఆర్లు… రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వేనెంబరు 92లో ఉన్న సుమారు 300 ఎకరాల బిగ్ బ్రదర్స్ ల్యాండ్‌పూలింగ్ చుట్టూ తిరుగుతున్న పదాలు ఇవి. నిరుపేదల అసైన్డ్ భూమిని, ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే కుట్ర జరుగుతుందంటూ ‘నమస్తే తెలంగాణ’ బాధ్యతాయుతంగా ఒక కథనాన్ని ప్రచురిస్తే రక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నిబంధనల ప్రకారం అనధికారిక ఒప్పందాలు చెల్లవంటూ రైతులను చైతన్యపరిచి ఆ భూమిని రక్షించాల్సిన యంత్రాంగం ఆ అంశాలను మరిచి కొందరు వ్యక్తులను కాపాడే పనిలో నిమగ్నమవడం… తద్వారా చోటుచేసుకున్న హడావుడిలో తప్పిదాల పరంపర కొనసాగింది. ముఖ్యంగా ఈ సివిల్ వ్యవహారంలో రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్ర పోషించగా… పోలీసు శాఖ అంతా తమ భుజాలపై వేసుకొని ‘నమస్తే తెలంగాణ’పై కేసు నమోదు చేయడంతో పాటు పలు ప్రకటనలతో బెదిరిస్తున్న తీరు ‘దాల్మే కుచ్ కాలాహై!’ అన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో పోలీసు అధికారుల వ్యవహారశైలి, ఎవరినో కాపాడేందుకు తాపత్రయపడటం ఆ తప్పిదాల్లోనే ప్రతిబింబించింది.
‘నేరస్తుడు తప్పు చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తాడు’ అనే నమ్మకం ఆధారంగా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అతి విశ్వాసం వల్లనో ఏమో ఈ వ్యవహారంలో పోలీసులు తప్పుమీద తప్పు చేయడమే కాదు; అనేక ఆధారాలు కూడా వదిలారు. నాదర్గుల్లో అసైన్డ్ భూములకు అక్రమ అగ్రిమెంట్లపై అక్టోబర్ 31న నమస్తే తెలంగాణ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్థానిక తహసీల్దార్ కూడా, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై కేసు కట్టే, ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) నమోదు చేసే విషయంలో పోలీసులు అనేక పొరపాట్లు చేశారు. కేసు విచారణకు కీలకమైన ఎఫ్ఐఆర్ నమోదులోనే లోపాలున్నట్టు బయటపడింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఇకనైనా దీన్ని సరిదిద్దుతారనే సదుద్దేశంతో, బాధ్యత గల పత్రికగా ఈ విషయాలను ప్రచురిస్తున్నాం.
బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్
1. ఒకటే అంశం.. రెండు ఎఫ్ఐఆర్లు!
సాధారణంగా ఒక అంశంపై ఒక నంబరుతో, ఒక ఎఫ్ఐఆర్ను మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ని కంప్యూటర్లో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మార్చే అధికారం పోలీసులకు లేదు. ఒకవేళ తప్పనిసరై మార్చాలనుకుంటే అందుకు తగిన పద్ధతిలో డీజీపీ నుంచి గానీ, కోర్టు నుంచి గానీ అనుమతి తప్పనిసరి. నిందితులకు అనుకూలంగా ఎఫ్ఐఆర్ని పోలీసులు మార్చే అవకాశం లేకుండా చేయడానికి ఈ నిబంధన విధించారు. అయితే బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ వ్యవహరంలో పోలీసులు ఏకంగా రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండింటి నంబరూ ఒక్కటే 1228/2024. ఇదెలా సాధ్యం?
2.ఇప్పటికీ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఎఫ్ఐఆర్
పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సైట్లో అప్లోడ్ చేసారు. ఇందులో అనుమానితుల కాలమ్‌లో ‘గుర్తు తెలియని వ్యక్తులు (అన్నోన్ పర్సన్స్)’ అని పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘నమస్తే తెలంగాణ’ కథనం రాసింది. ప్రవీణ్‌రెడ్డి పేరును చేర్చే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసామని, గుర్తు తెలియని వ్యక్తులు అని పెట్టలేదని 3వ తేదీన రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అయితే వెబ్సైట్లో ఇప్పటికీ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అన్న ఎఫ్ఐఆరే ఉంది. పోలీసులు మొదటనే ప్రవీణ్‌రెడ్డి పేరు చేర్చి ఉంటే మరి సైట్లో ఉన్న ఎఫ్ఐఆర్లో రాసిన ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఎవరు? ఎఫ్ఐఆర్ను మార్చడం చట్టవిరుద్ధమని పోలీసులకు తెల్వదా? తెలిసి కూడా తర్వాత ప్రవీణ్‌రెడ్డి పేరును అనుమానితుల కాలమ్‌లో చేర్చిన ఎఫ్ఐఆర్ను ఎలా ప్రచారంలో పెట్టారు? దాన్ని రాచకొండ డీసీపీ ఎలా సమర్థించారు?
3.రెండో ఎఫ్ఐఆర్పై సీఐ సంతకం
మొదటి ఎఫ్ఐఆర్ కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్. అందువల్ల దానిమీద చివరలో ‘సిగ్నేచర్ ఆఫ్ ఆఫీసర్ ఇన్చార్చి, పోలీసు స్టేషన్’ అన్న చోట కేవలం సీఐ కీసర నాగరాజు పేరు, ర్యాంకు ఉంది. కానీ రెండో ఎఫ్ఐఆర్లో ‘సిగ్నేచర్ ఆఫ్ ఆఫీసర్ ఇన్చార్జి, పోలీసు స్టేషన్’ అన్నచోట సీఐ స్వయంగా కె.నాగరాజు అని సంతకం చేసి తేదీ కూడా వేసారు. ఎఫ్ఐఆర్ను మార్చకుండా చూడాల్సిన అధికారే, మార్చిన ఎఫ్ఐఆర్ మీద ఎలా సంతకం చేస్తారు?
4.రెండో ఎఫ్ఐఆర్ ఫాంట్కూడా మారింది..
నిశితంగా పరిశీలిస్తే, మొదటి ఎఫ్ఐఆర్ను ఆదరాబాదరాగా, హడావుడిలో మార్చినట్టుంది. మొదటి ఎఫ్ఐఆర్లో ఇంగ్లిష్ టెక్స్ ఒక ఫాంట్లో ఉండగా, రెండో ఎఫ్ఐఆర్కు వచ్చేసరికి అది వేరే ఫాంట్‌లోకి మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో ఒకే సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నప్పుడు, ఒకే పోలీసు స్టేషన్లో జనరేట్ అయిన ఎఫ్ఐఆర్లో ఫాంట్ ఎలా మారుతుంది? అలాగే మొదటి ఎఫ్ఐఆర్లో అనుమానితుడి (7ఎ) కాలమ్‌లో అన్నోన్ పర్సన్స్ అని ఉండగా, ఫిజికల్ ఫీచర్స్ – సెక్స్ అనే కాలమ్‌లో మేల్ అని ఉంది. రెండో ఎఫ్ఐఆర్లో అనుమానితుడి కాలమ్‌లో ప్రవీణ్‌రెడ్డి అని స్పష్టంగా పేర్కొనగా, సెక్స్ అనే కాలమ్‌ని బ్లాంక్‌గా వదలివేసారు.
5. తహసీల్దార్.. రెండు ఫిర్యాదులు?
ఒక అంశంపై మండల మెజిస్ట్రేట్ స్థాయి అధికారి ఒకసారి ఫిర్యాదు చేయడమే అరుదు. కానీ నాదర్గుల్ భూముల విషయంలో మాత్రం తహసీల్దారు రెండు సార్లు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చూపిస్తున్నారు. మొదటి ఎఫ్ఐఆర్కు జత చేసిన ఫిర్యాదుపై తహసీల్దారు ఆఫీసు సీల్, చివర్లో తహసీల్దారు సంతకం, స్టాంపు ఉండగా, రెండో ఎఫ్ఐఆర్కు జత చేసిన ఫిర్యాదుపై మాత్రం తహసీల్దార్ ఆఫీసు సీల్, చివర్లో స్టాంపు లేవు. తొలి ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉండగా, రెండో ఫిర్యాదులో మాత్రం ప్రవీణ్‌రెడ్డి అని ఉంది. ఒకదానిపై అధికారిక ముద్రలు (సీల్) ఎందుకున్నాయి? రెండోదానిపై ఎందుకు లేవు?
…
6.రెండూ ఒకే టైమ్‌లో ఎలా వచ్చాయి?
తహసీల్దార్ ఇచ్చిన రెండు ఫిర్యాదులను ఒకేరోజు ఒకే సమయంలో (రిసీవ్డ్ ఆన్ 31/10/24 ఎట్ 1900 హెచ్ఆర్ఎస్) స్వీకరించినట్టు సీఐ వాటిమీద నోట్ రాసి సంతకం కూడా చేసారు. ఇంతకీ రెండు ఫిర్యాదులూ తహసీల్దారే ఇచ్చారా? అసలు ఒకే అంశంపై తహసీల్దారు ఒకే సమయంలో రెండు ఫిర్యాదులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇస్తే రెండు ఫిర్యాదులు ఎందుకు ఇస్తున్నారని సీఐకి అనుమానం రావాలి కదా! మొదటి ఫిర్యాదులోని తహసీల్దారు సంతకానికి, రెండో ఫిర్యాదులోని తహసీల్దారు సంతకానికి నడుమ గుర్తించగలిగిన కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి.
ఎఫ్ఆర్ను మార్చడం చట్ట విరుద్ధం. నేరం. మరీ అత్యవసరమైతే కోర్టు అనుమతితో తప్ప ఎఫ్ఐఆర్ను మార్చడం కుదరదు. అలాంటప్పుడు రెండో ఎఫ్ఐఆర్ ఎలా తయారైంది అన్నది ప్రశ్న. అంతేకాకుండా ‘గుర్తు తెలియని వ్యక్తులు’ పేరుతో ఉన్న మొదటి ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఇప్పటికీ కనిపిస్తుండగా, పోలీసులేమో తాము ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరును ముందే పెట్టినట్టు ప్రకటన చేసారు. ఇంతకీ ఇందులో ఏది అసలైన ఎఫ్ఐఆర్, పోలీసులు దేన్ని కోర్టుకు సమర్పిస్తారు?
7.మొదటి ఎఫ్ఐఆర్లో తేదీ, టైమ్ కంప్యూటర్ పరిభాషలో ‘31-10-2024 19.00.00’ అని ఉండగా, రెండో ఎఫ్ఐఆర్లో 31-10-2024 19.00 అని మాత్రమే ఉంది. సెకన్లను ఎగరగొట్టారు. రెండు ఎఫ్ఐ ఆర్లలోనూ నాదర్గుల్ ఇంగ్లిషు స్పెల్లింగుల్లో కూడా తేడా (కాపీ పేస్ట్) ఉంది. టెక్స్లో కూడా అనేకచోట్ల ఎడిట్ చేసిన ఆనవాళ్లున్నాయి.