బాన్సువాడ, మే 24: నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లి ఎక్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి స్పీకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983కు ముందు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ అధిష్టానం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఉండేదని, తెలుగువారి ఆత్మగౌరవం, పేదల బాగుకోసం ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించారని తెలిపారు.
తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ ఆశీస్సులతోనే మొదలైందని స్పీకర్ చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో ఉన్న నాయకుల్లో సగం మంది ఎన్టీఆర్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. రాజకీయాలు వ్యాపారం కాదని, రాజకీయం అంటే ప్రజాసేవ అని ఎప్పుడూ చెప్పే వారని స్పీకర్ గుర్తు చేశారు. దేశంలో సంక్షేమ శకం ప్రారంభమైంది ఎన్టీఆర్‌తోనేనని, రూ.2కే కిలో బియ్యం, జనతా వస్ర్తాల పంపిణీ, పక్కా ఇండ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనేసీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.