హైదరాబాద్: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మృతిపట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రెండు సార్లు నల్లగొండ ఎంపీగా విజయం సాధించిన సురవరం పేదల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. ఒక మంచి వామపక్ష భావజాలం ఉన్న నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని చెప్పారు.
సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సురవరం మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు భావాలను పునికిపుచ్చుకొని జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నేత సురవరం అని చెప్పారు. తెలంగాణకు చెందిన ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం మనకు గర్వకారణమన్నారు. రెండు సార్లు నల్లగొండ ఎంపీగా పనిచేసిన ఆయన ప్రజల పక్షపతిగా పేదల అభ్యున్నతి కోసం పని చేశారని గుర్తుచేసుకున్నారు. ఒక మంచి వామపక్ష భావజాలం ఉన్న నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సురవరం మృతిపట్ల మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సంక్షేమం కాంక్షించిన సైద్ధాంతిక నిబద్ధుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కన్నుమూయడం వాపక్షాలకు, ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొండ్రవుపల్లి వంటి మారుమూల గ్రామం నుంచి వెలిగి, జాతీయ స్థాయిలో సీపీఐ ప్రధాన నేతగా ఎదిగిన సుధాకర్ రెడ్డి అనేక ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నడిపిన అసమాన్య కమ్యూనిస్టు నాయకుడని సీతక్క స్మరించారు.
సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సీపీఐకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ భావాలను పునికిపుచ్చుకుని జీవిత పర్యంతరం తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నాయకుడని చెప్పారు. రెండు సార్లు నల్లగొండ ఎంపీగా, సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పేద, బడుగు, బలహీన వర్గాల సముద్ధరణకు ఆయన కృషి చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సీపీఐ శ్రేణులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కామ్రేడ్ సురవరం మరణం మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నిబద్ధత కలిగిన నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి బాధాకరమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రముఖ వామపక్షనేతగా గుర్తింపు పొందారని, ఏ పదవిలో ఉన్నా తనదైన ప్రత్యేక ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.