హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు మాత్రమే వేదిక అని.. కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించేలా అసెంబ్లీని వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో సూచించారు. శుక్రవారం శాసనసభ వాయిదాపడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్-1లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో యోచన చేయాలని స్పీకర్‌ను కోరారు. ఒక అర్ధవంతమైన చర్చ జరిగితే ఆ స్ఫూర్తిని సూచించేలా దానికి పేరు పెట్టాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాల సలహాలు, సూచనలను తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ సూచించిన ఐటీ, పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయంతోపాటు పాతబస్తీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమ తదితర అంశాలపై కూడా సభలో చర్చించాలని అన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, వాయిదా తీర్మానాలు వంటి సంప్రదాయలను విధిగా పాటించాలని సూచించారు. సభ్యులకు బిల్లులను ముందుస్తుగానే పంపించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. శాసనసభ్యులు ప్రొటోకాల్ నిబంధనలు తుచ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
అసెంబ్లీలోనూ కాన్స్టిట్యూషన్ క్లబ్
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలోనూ కాన్స్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తద్వారా నూతన సభ్యులు, మాజీ సభ్యులకు చర్చలు, డిబేట్లు, సెమినార్లు, బోధనకోసం వేదికను కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా సభ్యులను ఢిల్లీ తీసుకెళ్లి తెలంగాణ శాసనసభ ఔన్నత్యాన్ని పెంచడానికి చర్యలను చేపట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. శాసనసభ రూల్‌బుక్‌ను సమీక్షించాలని పేర్కొన్నారు. పలు కమిటీల మీటింగ్‌లు రెగ్యులర్‌గా జరిగేలా చూడాలని.. వీలైతే కమిటీ సభ్యులు దేశంలో, బయటిదేశాల్లో పర్యటించి కొత్త ఆంశాలను నేర్చుకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, టీ హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ గొంగిడి సునీత, ప్రతిపక్ష నేతలు అక్బరుద్దీన్, మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.
పథకాలను వివరిస్తాం: మంత్రి వేముల
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. అసెంబ్లీని 15 రోజులు నడిపించాలని సీఎం కేసీఆర్ సూచించారని, అందుకు అనుగుణంగా సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం పలు అంశాలను చర్చకు పెట్టిందని, ప్రతిపక్షాలు మరికొన్ని అంశాలపై జాబితా ఇచ్చాయని.. వీటిని ఎప్పుడు చర్చించాలనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ సమావేశాల్లో ఐదు బిల్లులను ఆమోదానికి సభ ముందుంచుతున్నామని చెప్పారు. ఈనెల 25న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామని తెలిపారు. బీజేపీని బీఏసీకి పిలవాలా వద్దా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారని అన్నారు. శానససభలో మాదిరిగానే మండలిలోనూ సమస్యలపై చర్చిస్తామని మంత్రి వేముల తెలిపారు. ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వవిప్ భానుప్రసాద్, సభ్యులు జాఫ్రీ, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల ప్రాథమిక షెడ్యూల్
సమావేశాలు: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 5వరకు
సెలవులు: సెప్టెంబర్ 25 (చాకలి ఐలమ్మ జయంతి), 26 ఆదివారం, అక్టోబర్ 2 (గాంధీ జయంతి), 3 (ఆదివారం).