హైదరాబాద్, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ): గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీయే ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. ప్రధాని మోదీ, అమిత్ షాకు గుజరాత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హిమాచల్‌ప్రదేశ్ సొంత రాష్ర్టాలు. దీంతో ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఎన్నికలు జరుగనుండటం తమకు సెమీ ఫైనల్‌గా ఆ పార్టీ భావిస్తున్నది. అయితే, ఆ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోవటం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్లో 2012 కంటే 2017లో బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయి. ఈసారి కూడా మరిన్ని సీట్లు తగ్గితే అధికారం కోల్పోవటం ఖాయమని చెప్తున్నారు. అదీకాక, ఆ పార్టీకి ఆమ్ఆద్మీ పార్టీ సవాల్ విసురుతున్నదని, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఆప్ హామీలు ఇస్తున్నదని అంటున్నారు. 2017లో గుజరాత్ అధికారం చేజిక్కించుకోవటానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (పటేల్ వర్గం) కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు దోహదం చేశాయి. ఈసారి మాత్రం అంతగా ప్రభావితం చేసే అంశమేది లేకపోవటం బీజేపీకి నష్టమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
గుజరాత్‌ను భౌగోళికంగా 4 భాగాలుగా చూస్తారు. రాష్ట్రంలో ప్రధాన వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్న రాజ్‌కోట్, జామ్‌నగర్ ప్రాంతాల్లో 54, ఉత్తర గుజరాత్లో 53 (రాష్ట్ర రాజధాని గాంధీనగర్ ప్రాంతం), దక్షిణ గుజరాత్లో 35, సెంట్రల్ గుజరాత్లో 40 (సూరత్, అహ్మదాబాద్ ప్రాంతం) అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2017) ఒక ఉత్తర గుజరాత్ ప్రాంతంలోనే బీజేపీ తన ప్రభావాన్ని కనబర్చి 50 శాతం ఓట్లు సాధించింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే సెంట్రల్ గుజరాత్లో మాత్రం గతం కంటే ఐదు సీట్లు ఎక్కువ సాధించింది. సౌరాష్ట్ర, కుచ్ ప్రాంతంలో కాంగ్రెస్ కంటే వెనుకబడింది. దక్షిణ గుజరాత్లో 35 సీట్లకు గాను 2017 ఎన్నికల్లో అంతకు ముందటి (2012) ఎన్నికల కంటే మూడు స్థానాలను బీజేపీ కోల్పోయింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో బీజేపీ గట్టెక్కుతుందా? లేదా? అన్నది పార్టీకి సవాల్‌గా మారింది. ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కావడం బీజేపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఈఘటనపై ప్రభుత్వమే సిట్ ఏర్పా టు చేసి విచారణకు ఆదేశించినా, దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూడా నిరుద్యోగం, పేదరికం ప్రభావితం చేయనున్నాయి.
గుజరాత్ – గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా సీట్లు
పార్టీ సీట్లు
బీజేపీ 99
కాంగ్రెస్ 77
ఎన్సీపీ 01
భారతీయ ట్రైబల్ పార్టీ 02
ఇండిపెండెంట్స్ 03
పార్టీ సీట్లు
బీజేపీ 44
కాంగ్రెస్ 21
సీపీఎం 01
ఇండిపెండెంట్స్ 02