Assembly Session : తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ), తెలంగాణ శాసన పరిషత్ (కౌన్సిల్) వర్షాకాల సమావేశాలకు వేళైంది. సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం నుంచి సెషన్ మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శనివారం శాసన పరిషత్ సమావేశ మందిరంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సన్నాహక సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి షురూ కానున్నాయి. అందుకని.. సమావేశాలను పకడ్బందీగా జరపాలన ప్రభుత్వం భావిస్తోంది. శనివారం ఇదే విషయమై శాసన సభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. సోమవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన పరిషత్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఈరోజు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్… pic.twitter.com/O1jIZ4BkjF
— Sridhar Babu Duddilla (@OffDSB) September 5, 2026
‘గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. సభ్యులకు అందించే మెటీరియల్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ముందస్తుగా సమర్పిస్తే, సభ్యులు చదువుకుని సమావేశాలకు హాజరవుతారు.శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి.
శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున అవసరమైన చర్యలు తీసుకోవాలి. సభ లోపలే కాదు బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు సజావుగా జరుగుతాయి. తెలంగాణ పోలీసు శాఖకు దేశ వ్యాప్తంగా సమర్ధవంతమైనదిగా పేరుంది. ఈసారి సమావేశాలు కూడా విజయవంతంగా జరగడానికి అవసరమైన రక్షణ, బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అని స్పీకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్….
సోమవారం నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) మరియు తెలంగాణ శాసన పరిషత్ (కౌన్సిల్) వర్షాకాల సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో… pic.twitter.com/Ct9CVkx0JS
— Gaddam Prasad Kumar (@GpkOfficial_) September 5, 2026
అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ శాసన మండలి, శాసన సభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. సభలు సజావుగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, గతంలో మాదిరిగా కాకుండా ఇంకా వేగంగా అధికారులు ఉండాలని ఆయన సూచించారు. ‘సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి. నోడల్ అధికారులను నియమించి, సమావేశాలు సక్రమంగా నిర్వహించాలి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని త్వరగా అసెంబ్లీ అధికారులకు అందించాలి. ధర్నాలు , రాస్తారోకోలు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా అధికారులు చూడాలి’ అని సుఖేందర్ రెడ్డి అన్నారు.

గౌరవ చైర్మన్, గౌరవ స్పీకర్ సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ‘ఒకరోజు ముందే సంబంధిత ప్రశ్నలకు జవాబులను అందజేయాలి. ఉభయ సభల సమావేశాల సమయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంటూ పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రతి శాఖ తరుపున ఒక అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్ధతకు ఉభయ సభల సమావేశాలు నిదర్శనం. అందుకే ప్రభుత్వ యంత్రాంగం తరుపున పటిష్టమైన చర్యలు తీసుకుని సమావేశాలు విజయవంతంగా జరపడానికి సహకరిస్తాం’ అని శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసన పరిషత్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ – GAD అహ్మద్ నదీమ్. హాజరైన డీజీపీ సీవీ ఆనంద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) శిఖా గోయల్, డీజీ (లా &ఆర్డర్) -మహేష్ భగవత్, అడిషనల్ డీజీ (ఇంటెలిజెన్స్) -విజయకుమార్, హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయలతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్ చీఫ్ మార్షల్స్- కర్ణాకర్, సంజీవ రెడ్డి పాల్గొన్నారు.