మెట్పల్ల్లి, మే 21 : జగిత్యాల జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఓ లెక్చరర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 5న బాలిక రజస్వల అయిందని తల్లిదండ్రులకు క్రీడా ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి సమాచారం అందించడంతో వారు వచ్చి తమ కూతురిని తీసుకెళ్లారు. తిరిగి అదే నెల 12న పరీక్షలు రాయడానికి గురుకుల పాఠశాలకు పంపించారు. వేసవి సెలవుల్లో భాగంగా 23 న ఇంటికి తీసుకెళ్లగా బాలికకు కడుపు నొప్పి, అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడ వైద్యపరీక్షలో బాలిక రజస్వల కాలేదని గుర్తించిన వైద్యురాలు, ఏమైనా అఘాయిత్యం జరిగి ఉండవచ్చని చెప్పడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. గురుకుల పాఠశాలలో ఓ లెక్చరర్ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపింది. ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్టు తెలిసింది. ఈ ఘటనపై బుధవారం డీఎస్వో విచారణ జరిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడితోపాటు సహకరించిన వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.