హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాహుల్‌గాంధీ మాతృమూర్తికే కాదు.. యావత్ భారతంలోని మాతృమూర్తులందరినీ అవమానించేలా ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వెంటనే అతడిని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం సీఎంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో సోమవారం అస్సాం సీఎంపై ఫిర్యాదుచేయాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోతే మంగళవారం అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల18న మహిళా కాంగ్రెస్ నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీతో కలిసి తాను ఫిర్యాదుచేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ పీఏసీ మీటింగ్‌కు సీనియర్లు డుమ్మా
కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. దీనికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దూరంగా ఉన్నారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌తో సమావేశమవ్వాలని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఈ సమావేశంలో సూచించడం కొసమెరుపు.