Lock to School | ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళం వేసే వరకు వెళ్లింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సాలెగూడ గ్రామపంచాయతీలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా ఈ పాఠశాలకు రూ.7.25లక్షల నిధులు మంజూరయ్యాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతులకు నిధులు విడుదలయ్యాయి. ప్రస్తుత హెచ్ఎం, రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న హెచ్ఎం మధ్య నిధుల విడుదల విషయంలో గొడవ జరిగింది. లీవ్‌లో ఉన్న అనంతరావు గత శుక్రవారం రోజు పాఠశాలకు వచ్చి ప్రస్తుత హెచ్ఎం కోట తిరుపతిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఒకరికొకరు చెప్పులు రాళ్లు విసురుకుంటూ బండబూతులు తిట్టుకున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు.
ఎప్పటిలాగే ఈ రోజు ప్రస్తుత హెచ్ఎం పాఠశాల విధులకు హాజరు.. కాగా, లీవ్‌లో ఉన్న హెచ్ఎం ఫోన్ చేసి నన్ను నానా బూతులు తిట్టాడని హెచ్ఎం తిరుపతి పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులు ఈ విషయాన్ని గ్రామస్తులు, తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరే ఇలా విద్యార్థుల ముందు తిట్టుకోవడం ఏంటని నిలదీశారు. దీంతో గ్రామస్తులు మీ ఉపాధ్యాయులు విద్యార్థులకు చెడు బుద్ధులు నేర్పిస్తున్నారని.. మీరు విద్యా బోధన చేపట్టవద్దంటూ బయటకు పంపారు. ఆ తర్వాత విద్యార్థులను సైతం ఇండ్లకు పంపి.. తరగతి గదులకు తాళాలు వేశారు. హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.