మనూరు, ఏప్రిల్ 14 : సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్‌స్టేషన్ ఎదుట పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్సై గోవింద్‌నాయక్ మృతిచెందాడు. మనూరు ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకా రం.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎన్టీ తండాకు చెందిన గోవింద్‌నాయక్ (59) మనూరు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై గోవింద్‌నాయక్, కానిస్టేబుల్ వెంకటేశ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని తహసీల్ కార్యాలయం ఎదుట నిలబడి పాయింట్ చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహన డ్రైవర్ రామారావు బొలేరో వాహనాన్ని వేగంగా నడుపుతూ వచ్చి ఏఎస్సై గోవింద్‌నాయక్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గోవింద్‌నాయక్‌ను కావాలనే డ్రైవర్ రామారావు వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు సుప్రీత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.